My pic

Apr 13, 2010

కమలాపురం సంతాన గోపాలాచార్యులు, ఆంధ్ర, తమిళ, మలయాళ, సంస్కృత భాషల్లో రామాయణ, భారత, భగవత్గీత పైన ఉపన్యాసాలు ఎంతో అద్భుతంగా ఇచ్చిన మహానుభావులు. ధనుర్మాసంలో తిరుప్పావై పైన వారి ఉపన్యాసానికి కనీసం ఒక వెయ్యి మంది వచ్చేవారు. వారి కుమారుడు వారి సుందరకాండ ప్రవచనాలని CD రూపంలో పొందు పరిచారు. విని తరించాల్సిన ప్రవచానాలివి. గత ఏడు రోజులు గా ఎన్ని మార్లు ఈ ప్రవచనాలని విన్నానో అంతే ఆనందాన్ని మళ్లీ మళ్లీ పొందినాను.

Mar 8, 2010

సీతారామ శాస్త్రి

సీతారామ శాస్త్రి గారి పాటలు ఒక్కొక్కటి ఒక్కో జాతి ముత్యం, రవి చెప్పినట్టు ఉత్తేజపరిచే పాటలు చాల రాశారు ఆయన. నాకు నచ్చిన పాటల్లో ఆయన సిరివెన్నెల సినిమాలో ఓం కారాన్ని నిర్వచిస్తూ రాసినది....

"కనుల కొలను లో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం"
"ఎద కనుమలలో ప్రతి ధ్వనించిన విరించి విపంచి గానం"

ఆయన పద జాలం ఆయనకే సాధ్యం!!!

Feb 13, 2010

ఒక నాటి సాయంత్రం

నిన్న ఒక మంచి పాటవిన్నాన్రా సీను "కిరాతార్జునీయం" వేటూరి వ్రాసినది...

అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తాడు దానితో ...."కంపించెనంతలో కైలాసమావేళ కనుపించెనంత అకాల ప్రళయ జ్వాల" ఇది గమనించిన సాంబ శివుడు చిరు నవ్వు తో అంబ వైపు చూశాడు, సీను, సాంబ అంటే "అంబ తో కూడి వున్నా వాడు" అని అర్థం వేటూరి ఎంత బాగా రాస్తాడు ఇక్కడ తెలుసా, "జగము లేలిన వాని సగము నివ్వెర బోయే, సగము మిగిలిన వాని మొగము నగవై పోయే" ఇక అర్జునుడికీ శివుడికి యుద్ధం, మరి అర్జునుణ్ణి రాబోయే భారత సంగ్రామంలో విజయునిగా నిలబెట్టాలి కదా! కిరాతునిగా శివుడి మారతాడు కూడా అమ్మ తరలి వచ్చింది.

అనితర సాధ్యంగా మన వేటూరి కూడా వ్రాస్తాడు "నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె తలపైని గంగమ్మ తలపులోనికి బారె" చూసావా ఇక్కడ "గంగ", ఆలోచన" రెండూ కూడా "పారే" లక్షణం కలవి కదా!! అందుకే కవి గంగమ్మను శివుని "తలపులోనికి" ప్రవహింప చేసాడు, నిప్పులువిసే కన్నునిదురోయి బొట్టవుతే, బూది పూతకు మారు పులితోలి వలువయ్యిందిట, ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారె తాను అరుకతగా అని శ్లేష చాల బాగా ప్రయోగించాడు కవి... ఎంత మంచి భావం కదరా శీను!! అసలు పద గుంభనం అంటే మన వేటూరిదే సుమా సప్త పది లో కూడా "రేపల్లియ...." పాట లో "మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి...." అని చాల అందంగా అంటాడు మన వేటూరి....

నిజమేరా అసలు తెలుగు లోనే వుంది ఈ అందం అంతా, కదా!! ఇద్దరమూ సంతృప్తిగా నవ్వుకుని ఆ రోజుకి ఇళ్ళకి బయలు దేరాం.
.........





Feb 1, 2010

అద్వైతం
నీ కంటి కలలకు తోరణాలు కట్టి
కన్నీటి అలలకు దోసిళ్ళు పట్టి
తనివార నీ కళ్ళు ముద్దిడుకోన
మనసార నా కళ్ళలో నింపుకోన
పన్నీరు జాల్వారు నీ గుండెలోని
ఊసులన్నీ కూడ నాకు గురుతేలే
నీవు నేనన్న సంగతే మరచి
మల్లెపూలా తెప్ప కట్టి ఈ రేయి లోన
గోదారి గంగలో దాగిపోదాములే
యశోదా మోహన్

Jan 31, 2010

"మాతృమూర్తి"
చిన్ని నా మనసునకు చేయూతనిచ్చినావు
పొరలు నా హృదయానికి పొందికనందించినావు
నా కంట నీరు చూసి నీవు కరగిపోయినావు
నీ కంటి నీటి తో నన్నుఅమృతమయుణ్ని చేసినావు
ఓనమాలు నేర్పించిన నీవు ఓంకారంలో అర్థాన్ని స్ఫురింప చేసినావు
అక్షరాలూ దిద్దించిన నీవు అక్షర సత్యంగా నిలచినావు
నను గన్న తల్లి బదులుగా నీకేమివ్వగలను?
కదిలిన ఈ కన్నీరు తప్ప!
నీవు నేర్పిన ఈ అక్షరాలు తప్ప!
యశోదా మోహన్
నువ్వు !!

నీవొక కాంతికిరణం
నీది గగన పథం

నిబిడాందకారాన్ని ఛేదించుకుంటూ
రివ్వ్వున సాగే రోదసీ నౌక నీ మనసు

కాలాన్ని పరిహసిస్తూ,
చుక్కల్లో కాలాన్ని గడిపేస్తూ
దిక్కులలో కలసిపోతూ
ఆనందంలో అలసి పోవాలి

ఓ మనిషీ ఎంత ధన్య జీవివి నీవు!
ఓ ప్రభూ ఎంత ప్రేమమయుడవు నీవు!

యశోదా మోహన్






నీ ప్రేమ!!
లలితలతా పరీవృత కుసుమ సౌరభము
త్వరిత హృదయ గర్భిత నిరీక్షణము

శరచ్చంద్ర చంద్రికా ప్రచ్ఛన్న రూపము
ప్రాభానిల చుంబిత శతపత్ర హసితమ్ము

యశోదా మోహన్