My pic

Jan 4, 2011

సంపూర్ణ శ్రీ రామాయణము - చాగంటి వారి అద్భుత ప్రవచనములు

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి సంపూర్ణ శ్రీ రామాయణ ప్రవచనాలని గత నెల రోజులుగా వింటూ చాల ఆనందిస్తున్నాను. చాగంటి వారి జనరంజకమైన ప్రవచనాలను ఎవరైనా సరే ఒక సారి వినడం మొదలు పెడితే పూర్తి అయ్యేవరకు ఆపలేరు, అంత అద్భుతంగా ప్రసంగిస్తారు వారు.

శ్రీ రాముని కటాక్షము సంపూర్ణంగా వారి పైన వున్నదని శ్రోతలు బాలకాండ మొదట్లోనే గ్రహించగలరు. యుగాలు మారినా సనాతన ధర్మము భారతీయ జన జీవనంలో "సూత్రే మణి గణాయివ" అన్నట్టు ఎట్లా ఇమిడి పోయి ఉన్నదో చాగంటి వారి ప్రసంగాలలో తేట తెల్లమౌతుంది.

ఆధునిక సంస్కృతికి అలవాటు పడి డబ్బు సంపాదన, ఐహిక సుఖము ముఖ్య ధ్యేయంగా స్వధర్మమును మరచిపోతున్న ఈనాటి యువతరానికి ఈ ప్రవచనాలు సనాతన ధర్మము పట్ల కనువిప్పు కలిగిస్తాయి.

వారి మాటల్లో "శ్రీ రామాయణాన్ని పరమేశ్వరుని అవతార కథగా కంటే ఒక నరుని కథ గా వింటే" ఈనాటి సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

సీతా రాముల అన్యోన్య దాంపత్యాన్ని వారు ప్రత్యేకంగా పేర్కొంటారు, పెళ్లి కాబోయే యువతీ యువకులు చదివితే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవము, అనురాగము పెరుగుతాయి.

శ్రీ రాముని ధర్మ నిరతి, భ్రాత్రు వాత్సల్యము, సర్వ భూతములయందు ప్రేమ, పరాక్రమము, సీతయందు గాఢమైన అనురాగము చాగంటి వారు ఆవిష్కరించిన రీతి అనితర సాధ్యము. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే శ్రీ రాముని గాంభీర్యము భారతీయ యువతి యువకులకు ఆదర్శము. చాగంటి వారు ఈ విషయాలను మళ్లీ మళ్లీ తమ ప్రవచనాలలో పేర్కొంటారు.

ఈ ప్రసంగాలలో నాకు నచ్చిన ఘట్టాలు "రామ భరత సంవాదము" "సీతా అనసూయ సంవాదము" "రాముని విలాపము" "సీతాన్వేషణము" అసలు ఒకటేమిటి అన్నీ అత్యద్భుతంగా వివరిస్తారు చాగంటి వారు.

వారి శ్రీ రామాయణ ప్రసంగాలను అన్నీ విన్న తరువాత శిరసు వంచి వారికి ప్రణామము చేస్తున్నాను. వారి హృదయంలోని శ్రీ రాముని మన కళ్ళ ముందర చూపించి ఎందరినో ధన్యులను గావిస్తున్న వారు నిజంగానే "సరస్వతి పుత్రులు".

6 comments:

  1. నేను కంప్యూటర్ లో డౌన్ లోడ్ చేసికున్నవీ, భక్తి, ఎస్.వి.బి.సి చానెల్స్ లో ప్రతీ రోజూ వచ్చే బ్రహ్మశ్రీ చాగంటి వారి ప్రవచనాలు వింటూంటాను.ప్రత్యక్షంగా వినే అవకాశం వచ్చిన మీరు ఎంతో అదృష్టవంతులు.

    ReplyDelete
  2. నిజంగా నాకు అంత అదృష్టం ఇంకా కలగా లేదు, నేను కూడా మీ లాగే srichaganti.net చేసి విన్నవే! శ్రీ రాముని దయ వుంటే ఆ రాజు తప్పక వస్తుందని ఆశిస్తున్నా!

    ReplyDelete
  3. విజయ్ గారు,

    మీరు అప్పుడెప్పుడో గుర్తు చేసుకున్నట్టు, రామునికన్నా రామనామం చాలా శక్తివంతమైనదనే శూక్తి, వీరి మాటల్లో చాలా ప్రస్పుఠంగా కనబడుతుంది. వీరి వర్ణనలు కొన్ని కొన్ని సార్లు ఆ యా సందర్బాలను మన కళ్ళ ముందుంచుతుంది అంటే అతిశయోక్తి కాదేమో.

    భవదీయ
    చక్రవర్తి

    ReplyDelete
  4. నిజమే చాగంటి వారు రామాయణంలో ప్రతి ఘట్టాన్నీ కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు. ప్రత్యేకంగా రామ రావణ యుద్ధ సన్నివేశం అనితర సాధ్యమే.

    ReplyDelete
  5. ఎంతో మంది పెద్దవారు తమ తమ అభిప్రాయాలు చాల చక్కగా చెప్పారు. ఎప్పుడో మూడు సంవత్సరాలు ముందు నుండి వినడం మొదలు పెట్టాను, ఇప్పటికి ఏదో క్రొత్తది వింటున్నుట్లే ఉంటుంది. ఇది ఇంత బాగుంటుది అని చెప్పడానికి దేనితో సారూప్యం తీసుకురావాలో అర్థం కావడం లేదు. ఆయన ఉపన్యాసాలు అన్ని వేటికి అవే సాటి. విరాట పర్వం, శివ పురాణం, భాగవతం, దేవి భాగవతం, భజగోవిందం, గజేంద్ర మోక్షం, దశమ స్కందం, లలితా సహస్ర నామ వివరణ, ఒక్కటేమిటి ఏది విన్న అందులో నుండి బయటికి రావడం కష్టం.

    చాలా చెప్పాలని ఉన్న మనసులో ఉన్న భావం బయటికి రావడం లేదు. మాటలతో కాని, రాతలుతో కాని చెప్పలేని ఒక మధురమైన అనుభూతి వ్యక్తీకరించడం నావల్ల కావడమ లేదు.

    పలికెడిది భాగవతమట
    పలికించెడి వాడు రామభద్రుడట
    నే పలికిన భవహరమగునట
    పలికెద వేరుండ గాఢ పలుకగనేల

    అని పోతనామాత్యుడు చెప్పినట్టు ఏది చెప్పాలన్న ఆ భగవంతుడి అనుగ్రహం ఉండాలి.

    ReplyDelete
  6. పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాది వైదేహి రామప్రభో
    పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాది వైదేహి రామప్రభో - పాహి రామప్రభో

    ReplyDelete