My pic

Jan 31, 2010

"మాతృమూర్తి"
చిన్ని నా మనసునకు చేయూతనిచ్చినావు
పొరలు నా హృదయానికి పొందికనందించినావు
నా కంట నీరు చూసి నీవు కరగిపోయినావు
నీ కంటి నీటి తో నన్నుఅమృతమయుణ్ని చేసినావు
ఓనమాలు నేర్పించిన నీవు ఓంకారంలో అర్థాన్ని స్ఫురింప చేసినావు
అక్షరాలూ దిద్దించిన నీవు అక్షర సత్యంగా నిలచినావు
నను గన్న తల్లి బదులుగా నీకేమివ్వగలను?
కదిలిన ఈ కన్నీరు తప్ప!
నీవు నేర్పిన ఈ అక్షరాలు తప్ప!
యశోదా మోహన్
నువ్వు !!

నీవొక కాంతికిరణం
నీది గగన పథం

నిబిడాందకారాన్ని ఛేదించుకుంటూ
రివ్వ్వున సాగే రోదసీ నౌక నీ మనసు

కాలాన్ని పరిహసిస్తూ,
చుక్కల్లో కాలాన్ని గడిపేస్తూ
దిక్కులలో కలసిపోతూ
ఆనందంలో అలసి పోవాలి

ఓ మనిషీ ఎంత ధన్య జీవివి నీవు!
ఓ ప్రభూ ఎంత ప్రేమమయుడవు నీవు!

యశోదా మోహన్






నీ ప్రేమ!!
లలితలతా పరీవృత కుసుమ సౌరభము
త్వరిత హృదయ గర్భిత నిరీక్షణము

శరచ్చంద్ర చంద్రికా ప్రచ్ఛన్న రూపము
ప్రాభానిల చుంబిత శతపత్ర హసితమ్ము

యశోదా మోహన్
నెచ్చెలీ!!

పసిడి పాదాలపై పారాణిగానిలిచి పోనా?
కాలి అందెలలో మువ్వగా చేరుకోనా?

పట్టు కుచ్చిళ్ళలోగాలిగా ఒదిగి పోనా?
విచ్చు చెక్కిళ్ళలోమెరుపుగా మిగిలి పోనా?

మృదుల హసితమునై పెదవిపై నవ్వుకోనా?
లలితపలుకుల ముత్యంగా రాలి పోనా?

మధుర భావమునై మనసులో ఉండిపోనా?
కనుల నీరుగా మారి నీ కళ్ళ నిండి పోనా?

యశోదా మోహన్
ఆనందం
ఎక్కడుంది?
తొలి మిత్రుని ఆత్మీయ వచనంలోనా?
తను మెచ్చిన సుందర కవనంలోనా?
ఎల కోయిల తీయని గాత్రం లోనా?
బుద్ధుని అర్థ నిమీలిత నేత్రం లోనా?
యశోదా మోహన్

Jan 26, 2010

తెలుగు సాహిత్యంలో - దేవరకొండ బాల గంగాధర తిలక్ - అమృతం కురిసిన రాత్రి, అడివి బాపిరాజు - నారాయణరావు, యండమూరి వీరేంద్రనాథ్ - ఆనందోబ్రహ్మ, ప్రార్థన, వెన్నెల్లో ఆడపిల్ల, చిలుకమర్రి రామానుజ చార్యుల గీతాంజలి (టాగోర్ గీతాంజలికి తెలుగు అనువాదం) నా సాహిత్య అభిలాషకు బీజం వేసిన రచనలు.

భక్తి సాహిత్యంలో పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారి పాటలు నాకు అత్యంత ప్రీతికరమైనవి
ఇంకా ఎన్నో రచనలు, సాహిత్య ప్రక్రియలు, ఎందరో మహా రచయితలు.....ఇవన్ని మీతో పంచుకోవాలనే ఆశతో ఈ సాహిత్య వేదికను ప్రారంభించినాను....

స్వాగతం.......