My pic

Feb 13, 2010

ఒక నాటి సాయంత్రం

నిన్న ఒక మంచి పాటవిన్నాన్రా సీను "కిరాతార్జునీయం" వేటూరి వ్రాసినది...

అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తాడు దానితో ...."కంపించెనంతలో కైలాసమావేళ కనుపించెనంత అకాల ప్రళయ జ్వాల" ఇది గమనించిన సాంబ శివుడు చిరు నవ్వు తో అంబ వైపు చూశాడు, సీను, సాంబ అంటే "అంబ తో కూడి వున్నా వాడు" అని అర్థం వేటూరి ఎంత బాగా రాస్తాడు ఇక్కడ తెలుసా, "జగము లేలిన వాని సగము నివ్వెర బోయే, సగము మిగిలిన వాని మొగము నగవై పోయే" ఇక అర్జునుడికీ శివుడికి యుద్ధం, మరి అర్జునుణ్ణి రాబోయే భారత సంగ్రామంలో విజయునిగా నిలబెట్టాలి కదా! కిరాతునిగా శివుడి మారతాడు కూడా అమ్మ తరలి వచ్చింది.

అనితర సాధ్యంగా మన వేటూరి కూడా వ్రాస్తాడు "నెలవంక తలపాగ నెమలి ఈకగ మారె తలపైని గంగమ్మ తలపులోనికి బారె" చూసావా ఇక్కడ "గంగ", ఆలోచన" రెండూ కూడా "పారే" లక్షణం కలవి కదా!! అందుకే కవి గంగమ్మను శివుని "తలపులోనికి" ప్రవహింప చేసాడు, నిప్పులువిసే కన్నునిదురోయి బొట్టవుతే, బూది పూతకు మారు పులితోలి వలువయ్యిందిట, ఎరుకగల్గిన శివుడు ఎరుకగా మారగా, తల్లి పార్వతి మారె తాను అరుకతగా అని శ్లేష చాల బాగా ప్రయోగించాడు కవి... ఎంత మంచి భావం కదరా శీను!! అసలు పద గుంభనం అంటే మన వేటూరిదే సుమా సప్త పది లో కూడా "రేపల్లియ...." పాట లో "మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి...." అని చాల అందంగా అంటాడు మన వేటూరి....

నిజమేరా అసలు తెలుగు లోనే వుంది ఈ అందం అంతా, కదా!! ఇద్దరమూ సంతృప్తిగా నవ్వుకుని ఆ రోజుకి ఇళ్ళకి బయలు దేరాం.
.........





Feb 1, 2010

అద్వైతం
నీ కంటి కలలకు తోరణాలు కట్టి
కన్నీటి అలలకు దోసిళ్ళు పట్టి
తనివార నీ కళ్ళు ముద్దిడుకోన
మనసార నా కళ్ళలో నింపుకోన
పన్నీరు జాల్వారు నీ గుండెలోని
ఊసులన్నీ కూడ నాకు గురుతేలే
నీవు నేనన్న సంగతే మరచి
మల్లెపూలా తెప్ప కట్టి ఈ రేయి లోన
గోదారి గంగలో దాగిపోదాములే
యశోదా మోహన్