My pic

Jun 16, 2010

గిరిజా కళ్యాణం

చాల రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్న ఒక పాట You Tube లో ముక్కామల వెంకట సుబ్బా రావు గారు పపబ్లిష్ చేశారు. "రహస్యం" సినిమా లోని గిరిజా కళ్యాణం అనే పాట. ముక్కామల గారికి అనేక కృతజ్ఞతలు.

తెలుగు వారికే సొంతమైన భాగవత నృత్య నాటక రీతిలో సాగుతుంది ఈ పాట. శివ పార్వతీ కళ్యాణ నేపథ్యంలో, శివుడు మన్మథుని అనంగుని చేయుట, రతి దేవి విలాపము, పార్వతి ప్రార్థనల తో మన్మథునికి తిరిగి రూపాన్నిఇవ్వడము ఈ రూపక సారాంశము.
రాగ మాలిక లో ఘంటసాల మాస్టారు గారి సంగీతం, సుశీల, లీల ల తో కలసి పాడిన తీరు అద్వితీయం. ఈ పాట లో మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలి,

"సామగ సాగమ సాధార, దీనాధీనా ధీసార"
"చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింత"
"వినక పోతివా ఇంతటితో, నీ విరి శరముల పని సరి..."

బహుశ: తెలుగు లో ఇంత మంచి పదాల వాడుక అదీ భాగవతుల నాటక పద్ధతతికి అనుగుణంగా వ్రాయటం శాస్త్రి గారికే సాధ్యమైన ప్రక్రియ అనుకుంటా!...

మన్మథుడు పార్వతితో పలికే మాటలు వింటే శాస్త్రి గారి పద ప్రయోగ చాతుర్యానికి ఆశ్చర్య పోక తప్పదు
"తగదిది తగదిది తగదిది తగదిది ధరణీ ధర వర సుకుమారి తగదిది" (భాగవత నృత్యం కాబట్టి అది "తక దిగి" కి దగ్గరగా తగదిది అనే పదాన్ని వాడడం చాల బావుంటుంది )
"అండగా మదనుడుండగా, మన విరి శరముల పడనుండగా,
నిను బోలిన సుర పావని తానై వరునరయగా పోవలెనా?"

ఇంత మంచి సాహిత్యాన్ని తెలుగు లోకానికి అందించిన శాస్త్రి గారు ధన్య జీవులు కదా!!

ఈ పాటను http://www.youtube.com/watch?v=bwMWTa2KmmA&feature=related లో చూడవచ్చు

1 comment:

  1. అహా.. ఎంత పాతకాలం నాటి పాట.. అప్పటికి నేను పుట్టి ఉంటానో లేదో.. అయినా.. ఇంతటి పాత రత్నాన్ని అందించినందులకు నెనరులు .. పాత స్కాచ్ త్రాగుతున్నట్లుంది ..

    "..ఈశుని దాశుని చేతువా!!! "

    పదాల కూర్పు ఎంతటి మధురము .. అహా.. మీకు ఒక్క సారి నెనరులు సరిపోవు.. మరి మరి ..

    ReplyDelete